గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ మే 07, 2026 గురువారం ఎపిసోడ్: కల్పనని నిలదీసిన బాలు … !!! బాలుకి సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయిన రోహిణి, మనోజ్ … !!!
విల్లా వ్యవహారంలో మోసపోయిన తర్వాత ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. సత్యం తీవ్రంగా కోపపడుతూ, జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా పోగొట్టుకోవడం చిన్న విషయం కాదని మనోజ్‌పై మండిపడతాడు. బాలు కూడా మొదటి నుంచి ఈ డీల్ పై అనుమానం వ్యక్తం చేశానని, ఐదు కోట్ల విల్లా మూడు కోట్లకే వస్తుందని ఎలా నమ్మారని ప్రశ్నిస్తాడు. ప్రభావతి మాత్రం మనోజ్ ఇప్పటికే మోసపోయి బాధపడుతున్నాడని అతన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు మీనా కూడా బాలు ముందే హెచ్చరించాడని గుర్తు చేస్తుంది. రోహిణి జరిగినది జరిగిపోయిందని విషయం వదిలేయమని చెప్పినా, బాలు మాత్రం సత్యంకి ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తారని నిలదీస్తాడు. ఈ సందర్భంగా రోహిణి తండ్రి, మలేషియా, జైలు విషయాలపై బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు.
ఇక మోసం చేసిన వాళ్ల గురించి తెలుసుకోవడానికి బాలు మణికంఠతో కలిసి ఎంక్వయిరీ మొదలుపెడతాడు. మణికంఠ కేవలం నెల రోజుల పరిచయంతోనే ఆ డీల్ ని నమ్మి మనోజ్‌కి చెప్పానని చెబుతాడు. దాంతో బాలు అతడిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తర్వాత వాళ్లు విల్లా దగ్గరకు వెళ్లి అక్కడ కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తిని ప్రశ్నిస్తారు. ఆ ఇంట్లో ఆ దంపతులు ఆరు నెలలుగా ఉంటున్నారని, ఈ మధ్య చాలామంది వచ్చి పోతున్నారని, అందులో ఒకరు టీవీ సీరియల్లో పనిచేసేవాడిలా కనిపించాడని చెబుతాడు. అలాగే ఆ ఇంట్లో పనిచేసే పనిమనిషి గురించి కూడా సమాచారం ఇస్తాడు. దీంతో బాలు ఆ పనిమనిషిని కలవాలని నిర్ణయించుకుంటాడు.
ఇక మరోవైపు మీనా పూల బండి దగ్గర సుమతి, పార్వతితో మాట్లాడుతుంది. మీనా బిజినెస్ బాగా ముందుకు వెళ్లాలని వాళ్లు ప్రోత్సహిస్తారు. బాలు తనకి చాలా సపోర్ట్ చేస్తున్నాడని మీనా చెబుతుంది. ఇదే సమయంలో రోహిణి–మనోజ్ విల్లా వ్యవహారం గురించి కూడా మాట్లాడుకుంటారు. తొందరపడి నమ్మేసి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని మీనా చెబుతుంది.
ఇంతలో బాలు అక్కడికి కొత్త కళ్లద్దాలు పెట్టుకొని వస్తాడు. ఆ కళ్లద్దాలు ఒక ముఖ్యమైన కస్టమర్ ఇచ్చిందని చెబుతాడు. సెల్ఫీ తీసుకునే సమయంలో బాలు ఫోన్లో ఉన్న ఒక ఫోటో చూసి సుమతి, మీనా షాక్ అవుతారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి రిసెప్షన్ సమయంలో కనిపించిన కల్పన అని గుర్తుపడతారు. తనే మనోజ్ దగ్గర నుంచి నలభై లక్షలు తీసుకుని పారిపోయిన అమ్మాయేనని బాలు అర్ధం చేసుకుంటాడు. దీంతో విషయం అంతా ఒక పెద్ద మిస్టరీలా అనిపించి, బాలు వెంటనే కల్పనను కలవడానికి వెళ్తాడు.
కల్పనను కలిసిన బాలు, మనోజ్‌ని మోసం చేసి అతని తండ్రి రిటైర్మెంట్ డబ్బు తీసుకుని పారిపోయిందని ఆమెను నిలదీస్తాడు. కానీ కల్పన మాత్రం అసలు ట్విస్ట్ బయటపెడుతుంది. తాను ఆ డబ్బు చాలాకాలం క్రితమే తిరిగి ఇచ్చేశానని, మనోజ్–రోహిణి ఇద్దరూ కలిసి తన దగ్గర నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేశారని చెబుతుంది. మొదట బాలు నమ్మకపోయినా, పోలీస్ స్టేషన్ లో జరిగిన సెటిల్మెంట్ సమయంలో తానే అనుకోకుండా సాక్షి సంతకం పెట్టిన విషయం గుర్తుకు వస్తుంది. అప్పుడు బాలు పూర్తిగా షాక్ అవుతాడు. కల్పన, మనోజ్ తన కుటుంబాన్ని మోసం చేశాడని, డబ్బు మొత్తం వడ్డీతో సహా తీసుకున్నాడని చెబుతుంది. అలాగే ఆ సెటిల్మెంట్ కి సంబంధించిన డాకుమెంట్స్, బ్యాంకు స్టేట్మెంట్స్ కూడా చూపించడానికి సిద్ధమని చెబుతుంది.
ఇంటి దగ్గర ప్రభావతి మరోసారి మీనా మీద మాటలతో దాడి మొదలుపెడుతుంది. మీనా పుట్టింటికి ఇంటి విషయాలు చెబుతుందని ప్రభావతి విమర్శించగా, మీనా కూడా పాత విషయాలు బయటపెడుతూ కౌంటర్ ఇస్తుంది. ఇదే సమయంలో బాలు ఇంట్లో అందరినీ హాల్లోకి పిలిచి, ఇంటినే ఒక కోర్ట్ లా మార్చేస్తాడు. సత్యం, ప్రభావతిని జడ్జిలుగా కూర్చోబెట్టి, మనోజ్‌ను నిందితుడిలా నిలబెడతాడు. మొదట అందరికీ ఏమి అర్ధం కాకపోయినా, బాలు ఒక్కొక్కటిగా నిజాలు బయటపెట్టడం మొదలుపెడతాడు.
బాలు మాట్లాడుతూ, సత్యం జీవితాంతం కష్టపడి సంపాదించిన రిటైర్మెంట్ డబ్బు మొత్తం మనోజ్ ప్రేమ పేరుతో కల్పనకి ఇచ్చాడని గుర్తు చేస్తాడు. అయితే అందరికీ తెలియని మరో నిజం ఉందని చెబుతూ, ఆ డబ్బు నిజానికి తిరిగి వచ్చిందని, కానీ మనోజ్–రోహిణి ఇద్దరూ ఆ విషయం కుటుంబానికి దాచిపెట్టారని ఆరోపిస్తాడు. మీనా సహా అందరూ షాక్ అవుతారు. రోహిణి సాక్ష్యం ఉందా అని ప్రశ్నించగా, బాలు కేవలం సాక్ష్యమే కాదు సాక్షి కూడా వస్తుందని చెబుతూ, మనోజ్ మాజీ ప్రియురాలు కల్పన పేరు బయటపెడతాడు. దీంతో ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.
