చిన్ని Nov 7th, 2025 శుక్రవారం ఎపిసోడ్: లోహిత నల్లపూసల తంతు కోసం వచ్చిన దొంగ తల్లిదండ్రులు…. !!!!
మధు, మ్యాడీతో మాట్లాడుతుండగా దేవాని పార్క్‌లో కలిసిన విషయాన్ని చెబుతుంది. తాను బయట కలవాలి అని వెళ్తే దేవా ఇంటికి తీసుకెళ్లి టిఫిన్ పెట్టి ప్రేమగా మాట్లాడారని, మ్యాడీతో మాట్లాడేందుకు కూడా ఒప్పుకున్నారని చెప్తుంది. ఈ విషయం విన్న మ్యాడీ చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు. సంతోషంలో మధుని కౌగిలించుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు.
ఆ తర్వాత మ్యాడీ, చందు, వరుణ్ కలిసి క్రికెట్ ఆడుతుంటారు. ఆట మధ్యలో మ్యాడీకి చిన్ని గురించిన ఆలోచనలే వస్తాయి. దాంతో ఆటపై దృష్టి పోయి అవుట్ అవుతాడు. ఆ విషయం గమనించిన మధు, మ్యాడీని ఆటపట్టించాలనుకుని ఫోన్ చేస్తుంది. ఫోన్లో అభిమానిని అని పరిచయం చేసుకుంటుంది. కానీ మ్యాడీ “ఇలా మళ్లీ కాల్ చేయొద్దు” అని చెబుతాడు.

దానికి మధు “ఒక మాట చెప్పి పెట్టేస్తా” అంటూ “నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు నాతో మాట్లాడకపోయినా, ఫోన్ కట్ చేసిన నీకు ఇష్టమైన హనుమంతుడిపై ఒట్టు” అని అంటుంది. మ్యాడీ ఆశ్చర్యంగా “నాకు హనుమంతుడు అంటే ఇష్టం అని నీకు ఎలా తెలుసు?” అని అడుగుతాడు. మధు “ఒకరిపై ఇష్టం ఉంటే ఆ వ్యక్తి గురించి అన్నీ తెలిసిపోతాయి” అని సమాధానమిస్తుంది.
తర్వాత మధు “ఈ షాట్లో నువ్వు చాలా క్యూట్‌గా ఉన్నావ్ బాస్” అని చెబుతుంది. ఆ మాట విన్న మ్యాడీ “నేను ఏం వేసుకున్నానో నీకు ఎలా తెలుసు?” అని ఆశ్చర్యంగా చుట్టూ అంతా చూస్తాడు. మధు చిరునవ్వుతో వెంటనే కాల్ కట్ చేసి సిమ్ కార్డు తీసేసి పక్కన పెడుతుంది.
మ్యాడీ మాత్రం ఆలోచనలో పడిపోతాడు. “ఎవరు ఈ అమ్మాయి? చిన్ని అయి ఉంటుందా? నా ముందుకు రాకపోవడం వల్లే ఇలా మాట్లాడుతుందేమో?” అని అనుకుంటాడు. ఆలోచిస్తూ లోపలికి వెళ్తాడు. అదే సమయంలో మధు వస్తూ మ్యాడీని కావాలని ఢీ కొడుతుంది. ఇద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుంటారు. కాసేపు కళ్లలోకి చూస్తూ నవ్వుకుంటారు. మ్యాడీ “చిన్ని గురించి ఆలోచిస్తూ చూసుకోలేదు” అని చెప్పి వెళ్లిపోతాడు.

అతడు వెళ్లిపోయాక మధు నవ్వుకుంటూ “చిన్నిని పక్కనే పెట్టుకుని చిన్ని గురించి ఆలోచిస్తున్నావా మహి” అని మురిసిపోతుంది.
ఇదిలా ఉంటే లోహిత ఆందోళనగా ఉంటుంది. వరుణ్ లోహితతో “ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు. మ్యాడీ చెప్పాడు కదా వారంలో ఇంటికి తీసుకు వెళ్తాను అని” అని అంటాడు. దానికి లోహిత “చెప్పాడు కానీ మా అమ్మ గురించి టెన్షన్‌గా ఉంది. మీ మామయ్య వాళ్ల మనసు మారుతుందో లేదో భయంగా ఉంది. మా అన్నయ్య బిజినెస్‌లు మానేశాడు. మన కష్టాలు ఇప్పట్లో తీరతాయా?” అని లోహిత అడుగుతుంది. అంతలో స్వరూప వచ్చి“ఒక మార్గం ఉంది, మీరు చేస్తాను అంటే చెబుతాను” అని అంటుంది. అంతలో మ్యాడీ, మధు కూడా అక్కడికి వస్తారు. అందరూ అదేంటో చెప్పమని అడిగినప్పుడు, “పెళ్లి అయినా అమ్మాయికి మెడలో తాళి ఎంత ముఖ్యమో నల్లపూసలు కూడా అంతే ముఖ్యం. నల్లపూసల కార్యక్రమం జరిగిపోతే అంతా మంచే జరుగుతుంది” అని చెబుతుంది.
మధు, మ్యాడీ ఇద్దరూ “అది మంచిదే” అని ఒప్పుకుంటారు. స్వరూప “కానీ మీ పుట్టింటి వాళ్లు కూడా కార్యక్రమంలో ఉండాలి” అని చెప్పగానే, లోహిత “అది కష్టం ఆంటీ. నాకు పెళ్లయింది అని మా ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఇది తెలిస్తే మా వాళ్లు తట్టుకోలేరు” అని చెబుతుంది. మ్యాడీ, వరుణ్ లు లోహితాని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు.

మ్యాడీ “మీ అమ్మని ఏదో ఒకటి చెప్పి కార్యక్రమానికి రప్పించు, మీ అమ్మగారికి నేను జరిగింది చెప్పి నేను నచ్చచెప్తాను” అని చెబుతాడు. కానీ లోహిత ఒప్పుకోకుండా “మా అమ్మ అంతా తేలికగా ఒప్పుకోదు. ఇంకా తన ఆరోగ్యం కూడా బాగోలేదు” అని అంటుంది. మధు కూడా మ్యాడీ ఒప్పిస్తా అంటున్నాడు కదా నువ్వు మీ అమ్మగారిని పిలవడానికి ట్రై చెయ్ అని అంటుంది. లోహిత ఇష్టం లేకుండానే “సరే” అని అంగీకరిస్తుంది, కానీ మనసులో మాత్రం “ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి, ఇపుడు ఏమి చేయాలి?” అని ఆలోచిస్తుంది.
ఇదే సమయంలో దేవా నాగవల్లితో మాట్లాడుతుంటాడు. “రేపు మ్యాడీని కలుస్తున్నా” అని దేవా చెబుతాడు. దాంతో వల్లీ “మధు చెప్పిందా?” అని అడుగుతుంది. దేవా “అవును, మ్యాడీ ఇంటికి వచ్చేలా నేను మాట్లాడుతా” అని చెబుతాడు. నాగవల్లి “వాడు ఒప్పుకుంటాడా? ఇంటికి వస్తాడా ?” అని అడుగుతుంది. దేవా “నేను వాడిని ఎలా అయినా ఒప్పిస్తాను. వాడు దూరంగా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నా. అమెరికాలో ఉన్నపుడు కూడా చాలా మిస్ అయ్యాను. నేను ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతాను. వాడు మాత్రమే వస్తాడు ఇంటికి” అని అంటాడు.

మధు ఇంట్లో నల్లపూసల కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి. మధు, లోహిత దగ్గరకు వెళ్లి “మీ తల్లిదండ్రులు ఇంకా రాలేదు, వాళ్లకు ఫోన్ చెయ్యి” అని చెబుతుంది. లోహిత తన ఫ్రెండ్ తో తల్లిదండ్రులుగా నటించడానికి మనుషులని తీసుకు రమ్మని చెప్తుంది , దాని గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. అంతలో లోపల వరుణ్ కొంచెం టెన్షన్‌గా ఉంటాడు, కానీ మ్యాడీ “ఏం లేదు, అన్నీ బాగానే అవుతాయి. మీ అత్తగారు వస్తున్నారు అంటేనే సగం ఒప్పుకున్నంతే. మీరు చెప్పకుండా చేసుకున్నారు అని కోపం ఉన్న కూడా నీ లాంటి మంచి వాడిని చూసి లైఫ్ అంతా సంతోషపడతారు” అని ధైర్యం చెబుతాడు.
కొంతసేపటికి లోహిత తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఎక్కడ వరకు వచ్చారు అని అడుగుతుంది. వీధి చివర ఉన్నారు అని చెప్పగానే లోహిత వెళ్లి కలుస్తుంది. వెళ్ళగానే అక్కడ తన ఫ్రెండ్ స్టేజి ఆర్టిస్ట్ లని తల్లిదండ్రులుగా తీసుకుని వస్తుంది. వాళ్ళు అట్టహాసంగా, ధనవంతుల్లా దుస్తులు ధరించి వస్తారు. వాళ్లు చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు.లోహిత వచ్చిన వాళ్ళని చూసి వాళ్ళ ప్రవర్తన చూసి లోహిత భయపడుతుంది ఎక్కడ దొరికిపోతారో అని. వాళ్ళకి ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో సూచనలు చేసి వాళ్ళని రమ్మని తాను వెళ్ళిపోతుంది.

అంతలో ఇంటి దగ్గర మధు ఇంటి ముందు ముగ్గు కి రంగులు అద్దుతూ ఉంటుంది. మ్యాడీ ఫోన్ మాట్లాడుతూ చూసుకోకుండా ముగ్గు మీద నుండి వెళ్తాడు.
అలా అందరూ కలిసి నల్లపూసల కార్యక్రమానికి సిద్ధమవుతుండగా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “చిన్ని” (JioHotstar). This is a personal written recap and interpretation.
