ఇంటింటి రామాయణం Nov 14th, 2025 శుక్రవారం ఎపిసోడ్: పల్లవి దగ్గర తప్పించుకున్న చక్రధర్ … !!! అవనికి సపోర్ట్ గా అక్షయ్ … !!!!
ఎపిసోడ్ ప్రారంభంలో పల్లవి ఇంటికి వస్తుంది. చక్రధర్ చూసి “మీ అమ్మ కోసం వచ్చావా? ఆమె లోపలే ఉంది వెళ్లు” అని చెబుతాడు. దాంతో పల్లవి సూటిగా “అమ్మతో మాట్లాడటానికి కాదు, మీతో మాట్లాడటానికి వచ్చాను” అంటుంది. ఆ మాట విన్న వెంటనే చక్రధర్ గుండె ఒక్కసారిగా కుదుపు తింటుంది. అతను తన విషయం బయటపడిందేమోనని భయపడిపోతాడు. ఇంతలో రాజేశ్వరి కూడా లోపల్నుంచి బయటకు వస్తూ “ఏంటి పల్లవి, ఇలా వచ్చావేంటి? మళ్లీ ఎవరితోనైనా గొడవ పడ్డావా?” అని అడుగుతుంది.
పల్లవి తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేక “మీరిద్దరూ నా తప్పే అని చెబుతూ, ఆ మీనాక్షికి సారీ చెప్పించారు. కానీ నేను చేసినది తప్పయితే, నాన్న చేస్తున్నది ఇంకా పెద్ద తప్పు. దాని గురించి అడగటానికే వచ్చాను” అని నేరుగా అంటుంది. ఆ మాటలతో చక్రధర్ ముఖంలో రంగులు మారిపోతాయి. “పల్లవికి నా విషయం తెలిసిపోయిందా? ఎవరైనా ఏమైనా చెప్పారా?” అని తనలో తాను ఆలోచిస్తూ ఆందోళనకి లోనవుతాడు.

పల్లవి కోపంగా కొనసాగిస్తూ “అవని అమ్మ ఎవరో నాకు, మీకు, డాడ్కి ఎవరికీ తెలియదు. మనకి అసలు తెలియని ఆ మీనాక్షి నన్ను కొట్టింది. అలాంటి ఆవిడకి డాడ్ రోడ్డుమీద డబ్బులు ఇస్తున్నారు. నేను అన్నీ చూశాను” అని బాంబు పేలుస్తుంది. ఆ మాట విన్న చక్రధర్ ఒక్క క్షణం మాట రానివాడిలా నిలబడి పోతాడు.
రాజేశ్వరి కూడా ఆశ్చర్యంగా “చక్రధర్, మీరు నిజంగా వాళ్లకి డబ్బు ఇవ్వబోయారా? ఎందుకలా చేశారు?” అని ప్రశ్నిస్తుంది. పల్లవి మళ్లీ అడుగుతుంది — “వాళ్లకి డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది డాడ్?”. దాంతో చక్రధర్ చాకచక్యంగా మాటలు తిప్పి “నేను వాళ్లకి డబ్బు ఇచ్చేది నీ కోసమేమ్మా. నీకు మంచే జరుగుతుందని అనుకున్నా” అని సమాధానమిస్తాడు.
పల్లవి అయోమయంగా “వాళ్లకి డబ్బులు ఇస్తే నాకు మంచి ఎలా జరుగుతుంది?” అని అడుగుతుంది.
చక్రధర్ ఆలోచించి “ఆ ఇంట్లో ఆ మీనాక్షి వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. ఆమె తిండికి దిక్కు లేక కూతురు కోసం అని వచ్చి అక్కడ ఉండిపోయింది. అలాంటి దానికి కొంచెం డబ్బు ఆశ చూపిస్తే వెళ్ళిపోతుంది. ఆమె లేకపోతే నీకు ప్రశాంతంగా ఉంటుంది అనిపించి డబ్బు ఆఫర్ చేసా. నీకు మేలు చేయాలనుకున్నాను” అని చెబుతాడు.

రాజేశ్వరి వెంటనే చక్రధర్ మాటలు వినగానే గట్టిగా “మనకి డబ్బు ఉందని అందరు డబ్బు కోసం ఆశ పడతారు అనుకోవడం తప్పు. ఆమె తమ కూతుర్ని చూడాలనే ఆశతో వచ్చుంటారు. దానిని ‘గతిలేక వచ్చింది’ అని అనడం చాలా తప్పు. మమకారం, ప్రేమ, అనురాగం ఇవి డబ్బుతో కొనలేవు” అని స్పష్టంగా చెబుతుంది.
చక్రధర్ కాస్త గట్టిగా “నీకు తెలియదేమో రాజేశ్వరి. నీకు అనిపిస్తున్న ఆ అభిమానాన్ని అహంకారంగా మార్చగలిగేది డబ్బు ఒక్కటే. దేవుడిని కూడా పూజించని వాళ్లు డబ్బుకి చేతులు కట్టుకుంటారు. అందుకే ఇవ్వాలనుకున్నాను. పల్లవి అక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని అనిపించింది” అని చెబుతాడు.
రాజేశ్వరి చక్రధర్ వైపు చూసి “ఇంత మారిపోయారు మీరు. ఇంతకుముందు పల్లవి ఏ తప్పు చేసినా ఆమె వెనక నిలబడ్డారు. ఇప్పుడు ఆమె తప్పు చేస్తే మీరు తప్పు అని చెబుతున్నారు. నేను కోరుకునేది మీరు నవ్వుతూ ఉండడం, మంచిగా ఉండడం మాత్రమే” అని చెబుతూ లోపలికి వెళ్తుంది.

పల్లవి సీరియస్గా “మీరు నా కోసం ఆ డబ్బు ఇచ్చారని అంటున్నారు, సరే. కానీ వాళ్లు ఆ డబ్బులు తీసుకోలేదు కదా?” అని అడుగుతుంది. చక్రధర్ “అవును, తీసుకోలేదు. అందుకే ఇప్పుడు ఆ మీనాక్షిని ఎలా బయటకు పంపాలో ఆలోచిస్తున్నాను. ఎవరికీ అనుమానం రాకుండా నువ్వే ఏదో ప్లాన్ చెయ్. నేను నీకు సపోర్ట్ చేస్తాను” అని చెబుతాడు. పల్లవి తల ఊపుతూ “సరే డాడ్, నేను ప్లాన్ చేస్తాను” అని చెబుతుంది.
చక్రధర్ ఆమె వెళ్ళిపోతుంటే “ఏమైనా జరిగేలోపే ఆ మీనాక్షిని ఎలాగైనా వదిలించుకోవాలి” అని మనసులో అనుకుంటాడు.
మరోవైపు అవని ఇంట్లో సీన్ మొదలవుతుంది. ఇంటి యజమాని అద్దె కోసం వస్తాడు. అవని రెంట్ ఇస్తుంటే హౌస్ ఓనర్ “మొన్న ఎవరో బయట బట్టలు ఆరేస్తుంటే చూశా, ఆమె ఎవరు?” అని అడుగుతాడు. అక్షయ్ “మా అత్తయ్య గారు సర్” అని సమాధానం ఇస్తాడు.

అదే వినగానే యజమాని “ముగ్గురు నలుగురికంటే ఎక్కువ మంది ఉంటే ఇల్లు అద్దెకి ఎవరూ ఇవ్వరు. కానీ నేను మంచిగా అనుకుని ఇచ్చాను. కానీ ఇప్పుడు రోజు రోజుకీ కొత్తవాళ్లు వస్తున్నారు. ఇది ఇల్లా లేక సత్రామా?” అని చీవాట్లు పెడతాడు. పల్లవి ఈ అవకాశాన్ని వదలకుండా “చూశావా అవని, మీ అమ్మని పంపించి ఉంటే ఇంత అవమానం రాకపోయేది” అని అంటుంది. దాంతో ఓనర్ “సరే, ఇప్పుడు అదనంగా మీ అమ్మ ఉన్నందుకూ రెండు వేలు ఎక్కువ ఇవ్వాలి” అని చెబుతాడు. అవని వెంటనే “సరే” అని అంగీకరించి మొత్తం రెంట్ ఇస్తుంది.
ఓనర్ వెళ్లిన తర్వాత అక్షయ్ “ఇంటి అద్దె నా భార్య ఒక్కర్తే ఎందుకు ఇవ్వాలి? మనమందరం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అందరం షేర్ చేద్దాం” అని అంటాడు. అవని “అయ్యో ఎందుకండీ?” అని అణకువగా చెబుతుంది. దాంతో అక్షయ్ తమ్ముడు కమల్ వెంటనే “టీవీలు, కార్లు కొంటాం కానీ ఇంటి అద్దె ఇచ్చేందుకు డబ్బు ఉండదు అంటారా? 12 వేలు ముగ్గురికి సమానంగా చేసుకుంటే 4 వేలు వస్తుంది. ఇదిగో నా వాటా” అంటూ డబ్బు ఇస్తాడు.

శ్రీకర్ కూడా పర్సు తీసి ఇవ్వబోతే శ్రేయ ఆపేస్తుంది. “ఇంటి అద్దె 10 వేలే. అవని వాళ్ల అమ్మ ఉండటంతో ఎక్స్ట్రా అయింది. ఆవిడ కోసం మనం ఎందుకు ఇవ్వాలి? 3 వేలే ఇవ్వు చాలు” అని చెబుతుంది. దాంతో పల్లవి “బావా, శ్రేయ చెప్పింది నిజమే. 3 వేలే ఇవ్వు చాలు” అని మద్దతిస్తుంది. అవని మాత్రం “మీరు ఇవ్వక్కర్లేదు. ఇంటి అద్దె బాధ్యత నాది” అని తేల్చి చెబుతుంది.
అక్షయ్ కోపంగా “బాధ్యత అందరికీ ఉంటుంది అవని. బాధ్యత లేని వాళ్లు ఎక్స్ట్రా మనుషుల గురించి మాట్లాడే హక్కు ఉండదు” అని చెబుతాడు. ఇది విన్న శ్రేయ గట్టిగా “సరే, ఇప్పుడు మా వాటా ఇచ్చాం కదా. మరి ఆవిడ తిండికి కూడా మేమే భరించాలా?” అని వాగుతుంది. అక్షయ్ కఠినంగా “మా అత్తగారి అవసరాలన్నీ నేను చూసుకుంటాను. ఆ అవసరం నీకు లేదు” అని సమాధానమిస్తాడు.
పార్వతి ఈ వాగ్వాదం చూసి “శ్రేయ, నువ్వు ఇలా మారిపోతావని అనుకోలేదు. నీలో వచ్చిన ఈ మార్పుని అర్థం చేసుకోలేకపోతున్నాను” అంటుంది. శ్రేయ వెంటనే “మార్పు అందరిలో వస్తుంది అత్తయ్య. అవని అక్క వల్ల మన ఇంటి పరిస్థితులు మారలేదా? మీరు చెప్పిన మాట వినకుండా మీ కూతురు మారలేదా? ఇప్పుడు అవని అక్క కోసం అక్షయ్ బావ గారు మారిపోలేదా? అప్పుడు నేను మారితే తప్పేంటి?” అని కౌంటర్ ఇస్తుంది.

దీన్ని చూసి కమల్ నవ్వుతూ “మీ జంట సూపర్. మీరిద్దరూ కాంబినేషన్ బాగుంది” అని వెటకారం చేస్తాడు. శ్రేయ “మరిన్ని జోకులు వినాలా రండి లోపలకి” అని శ్రీకర్ తో అనేసి వెళ్లిపోతుంది.
తర్వాత అవని అక్షయ్ దగ్గరకు వచ్చి “ఎందుకు వాళ్లని అద్దె డబ్బు అడిగారు?” అని అడుగుతుంది. అక్షయ్ ప్రశాంతంగా “ఇంటి అద్దె మనమందరం కట్టడం సబబే కదా” అని చెబుతాడు.
ఇంతలో శ్రేయ శ్రీకర్ దగ్గర టీవీ, కారు, ఖర్చుల విషయం మీద గొడవ మొదలుపెడుతుంది. “ఇప్పుడు టీవీ కొన్నావ్, దానికి కేబుల్, ఓటీటీ ఖర్చులు. తర్వాత కారు కొనబోతున్నాం, దానికి సర్వీసింగ్. ఇంత ఖర్చు ఉన్నప్పుడు ఇంటి అద్దె డబ్బు ఎందుకిచ్చావ్?” అని ప్రశ్నిస్తుంది. శ్రీకర్ సీరియస్గా “ఇంటి అద్దె ఇవ్వడంలో తప్పేంటి? మనమూ ఇక్కడే ఉంటున్నాం కదా” అని చెబుతాడు. శ్రేయ మాత్రం వాదిస్తూ “ఇలా అన్నీ ఇస్తూ ఉంటే ఇది ఇల్లు కాదు, జైలు అవుతుంది. మన లైఫ్ మనకు నచ్చినట్లు ఉండాలంటే మనం ఇలా ఉండకూడదు. దానికి ఏం చేయాలో నేనే ఆలోచిస్తాను” అని చెబుతుంది.

ఇక మరోవైపు అవని దగ్గర అక్షయ్ తిరిగి వస్తాడు. “అత్తయ్య అన్నం తిన్నారా?” అని అడిగి, “రేపు ఉదయమే BP మెషిన్ తీసుకువస్తాను, రోజూ చెక్ చేయి, మొన్నటిలా జరగకూడదు” అని శ్రద్ధగా చెబుతాడు. అవని కన్నీళ్లతో “ఇప్పుడు నా గురించి ఆలోచిస్తున్నారు, నా కుటుంబం గురించి కూడా పట్టించుకుంటున్నారు. నాకు ఇది చాలా సంతోషంగా ఉంది” అని అంటుంది. అక్షయ్ “ఇప్పటి వరకు నిన్ను అర్థం చేసుకోకుండా బాధపెట్టాను. ఇప్పుడు తెలుసుకున్నాను. అందుకే సిగ్గుపడుతున్నాను” అని చెబుతాడు.
అవని మృదువుగా “తప్పు చేసి సరిదిద్దే వాళ్లే గొప్పవాళ్లు. కానీ నేను ఎలాంటి తప్పూ చేయకుండానే పరిస్థితి ఇలా వచ్చింది. అందుకే బాధగా ఉంది. మీరు మళ్లీ పాత స్థితికి చేరాలని అనుకున్నా, అందుకే లోన్ తీసుకున్నా. కానీ దొంగ సంతకాలు చేసి మోసం చేశాడు” అని చెబుతుంది. అక్షయ్ “అది అర్ధం చేసుకున్న కాబట్టే నిన్ను లాయర్ దగ్గరికి తీసుకెళ్లా. నువ్వు తప్పు చేయలేదని ఇప్పుడు ప్రపంచం ముందు నేనే చెబుతాను” అని ధైర్యం ఇస్తాడు. అవని కళ్ళలో కృతజ్ఞత నిండిపోతుంది.
ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “ఇంటింటి రామాయణం” (JioHotstar). This is a personal written recap and interpretation.

