కార్తీక దీపం – Oct 30, 2025 గురువారం ఎపిసోడ్ : జ్యోత్స్నకి షాక్ ఇచ్చిన కార్తీక్, పారు, శివన్నారాయణ!!!!
దశరథ్ తన మనసులో ఉన్న బాధ అంతా కార్తీక్‌కి చెబుతున్నాడు. అయితే అదే సమయంలో చాటుగా సుమిత్ర కూడా వాళ్ల మాటలు వింటోంది. దశరథ్ తన బాధలో మునిగిపోయి ఉంటాడు, కానీ కార్తీక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. సుమిత్రను చూసి ఆశ్చర్యపోయాడు. సుమిత్ర వెంటనే సైలెంట్‌గా సైగ చేస్తుంది — ‘మావయ్యకి చెప్పొద్దు’ అని. ఆ తరువాత తలదించుకుని అక్కడినుంచి నిశ్శబ్దంగా వెళ్తుంది.

కార్తీక్ ఒక్కసారిగా అయోమయానికి లోనవుతాడు. ఏమి చేయాలో అర్థం కాక ‘మావయ్యా… అత్త బాగానే ఉంది, త్వరలో కలుస్తుంది’ అనబోతాడు కానీ, అప్పటికే సుమిత్ర నడిచి వెళ్లిపోతుంది. వెంటనే ఆమె వెనక పరిగెత్తి ‘అత్తా, ఆగు… ఎక్కడికి వెళ్తున్నావ్?’ అని పిలుస్తాడు.
సుమిత్ర తిరిగి చూసి మృదువుగా చెబుతుంది – ‘ఆయన అన్నదంతా విన్నాను కార్తీక్, అందుకే వెళ్తున్నాను.’ కార్తీక్ ఆపడానికి చేయి చాపుతాడు. సుమిత్ర కళ్లల్లో కన్నీళ్లు మెదులుతుంటాయి. ‘ఒకసారి ఆయనకు విధి దూరం చేసింది, ఇప్పుడు నేను భయంతో దూరం అవుతున్నాను,’ అంటుంది ఆమె.
‘భయం ఎందుకు అత్తా?’ అని కార్తీక్ నెమ్మదిగా అడుగుతాడు.
‘ఆయన చివర్లో ఏమన్నారు విన్నావ్ కదా — నా ముఖం చూసే అర్హత లేదు అన్నారు. నేను ఇప్పుడు ఆయన ముందు నిలబడ్డా, ఆయన తలదించుకుంటారు. అది నేను భరించలేను కార్తీక్. ఆయనను ఆ స్థితిలో చూడలేను. ఆయన ఏడుస్తుంటే నా గుండె పగిలిపోతుంది,’ అంటుంది సుమిత్ర చిన్నగా.
కార్తీక్ సాంత్వనగా చెబుతాడు – ‘ఆయన ఏడుస్తున్నారని నేనే చెప్పాను కదా అత్తా.’
సుమిత్ర నిట్టూర్చుతూ అంటుంది – ‘ఇంట్లోనుంచి బయటికి వెళ్లిన తర్వాత నేనెవరో నేనే మర్చిపోయాను కార్తీక్. ఇప్పుడు ఆయనను చూసాక నాకు నా తప్పు ఎంత పెద్దదో అర్థమైంది. ఇంతవరకూ నేను చేసినది ఎంత పొరపాటో తెలిసింది. ఇప్పుడు ఆయన ముందు ఎలా నిలబడగలను చెప్పు?’
అప్పుడు కార్తీక్ ప్రశ్నించాడు – ‘ఇప్పుడు మావయ్య ఒక్కసారిగా నీ ముందు వస్తే, నువ్వేం చేస్తావ్ అత్తా?’
సుమిత్ర తడుముకుంటూ చెబుతుంది – ‘ఎవరికి తెలియదు కార్తీక్, ఆయన కాళ్లపై పడిపోతానేమో, లేక మాట రాకుండా నిలబడి పోతానేమో. కానీ ఆయన చూసేలోపు నేను వెళ్లిపోవాలి.’
అలా వెళ్ళబోతుండగానే, వెనుకనుండి దశరథ్ పెద్దగా అరుస్తాడు – ‘సుమిత్రా!’
సుమిత్ర ఒక్కసారిగా ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తుంది. దశరథ్ కళ్లల్లో కన్నీళ్లు, కానీ ప్రేమ కూడా ఉంది. వేగంగా ఆమె దగ్గరకు వచ్చి చెబుతాడు – ‘సుమిత్రా, నువ్వు నా కాళ్లపై పడాల్సిన పనిలేదు. నన్ను క్షమించు సుమిత్రా.’
అంతే, సుమిత్ర చలించిపోతుంది. దశరథ్ చేతులు పట్టుకుని ఏడుస్తుంది. దశరథ్ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. “ఇప్పటి వరకు మన మధ్య దూరం చాలదా? ఇంకా ఎంత దూరం వెళ్లిపోవాలనుకున్నావ్?” అంటాడు మనసులోని బాధతో.
కార్తీక్ చిరునవ్వుతో చెబుతాడు – ‘ఇప్పుడు అత్త ఎక్కడికీ వెళ్లదు మావయ్యా. దేవుడే మిమ్మల్ని మళ్లీ కలిపాడు. మీరు ఇద్దరూ మనసులో ఉన్న మాటలు మాట్లాడేసుకుని, బాధ దించేసుకోండి.’ సుమిత్ర, దశరథ్ ఒకరినొకరు చూసి మెల్లగా నవ్వుతారు.
తర్వాత కార్తీక్ సంతోషంగా అంటాడు – ‘ఇప్పుడే నా ఆవిడని పిలుస్తాను, మీ ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంటాం.’
దశరథ్ చుట్టూ చూసి అడుగుతాడు – ‘దీప వచ్చిందా?’
కార్తీక్ నవ్వుతూ అంటాడు – ‘అత్తను దీపే తీసుకువచ్చింది.’
సుమిత్ర అప్పుడు చెబుతుంది – ‘నన్నెవ్వరూ తీసుకురాలేదు కార్తీక్, నేనే వచ్చాను.’
కార్తీక్ ఆశ్చర్యపడి – ‘నువ్వే వచ్చావా? కానీ దీప తర్వాత వస్తానంది కదా?’
సుమిత్ర సమాధానమిస్తుంది – ‘నేను ఎవరికీ చెప్పలేదు, నేనే వచ్చాను.’
కార్తీక్ వెంటనే గుర్తుకు తెచ్చుకుంటాడు – ‘అంటే దీప ఫోన్ చేసింది అనుకుంటా… ఓహ్! నా ఫోన్ కారులో ఉంది కదా! మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెంటనే వస్తాను,’ అని చెప్పి కార్ వైపు పరుగెడతాడు.
ఇక మరోవైపు, పోలీస్‌స్టేషన్‌లో జ్యోత్స్న పోలీస్‌లను ఆదేశిస్తూ, దీపను ప్రశ్నించమని, కొట్టమని చెబుతుంది. దీప మాత్రం మర్యాదగా సమాధానం చెబుతుంది – ‘నాకు సుమిత్ర గురించి ఏమీ తెలియదు, దయచేసి కేసు వెనక్కి తీసుకోండి’ అని. అప్పుడు ఫోన్ మోగుతుంది. కాల్ కార్తీక్‌ది. జ్యో వెంటనే దీప ఫోన్ లాక్కుని, కాల్ ఎత్తుతుంది – ‘హలో బావా,’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. దీపను అరెస్ట్ చేసిన సంగతి చెబుతుంది.
అది విని కార్తీక్ కోపంతో ఊగిపోతాడు. ‘నీకు పది నిమిషాల టైమ్ ఇస్తున్నాను. పది నిమిషాల తర్వాత నేను ఇదే నంబర్‌కి కాల్ చేస్తాను. అప్పటికి ఈ ఫోన్ నా భార్య చేతిలో ఉండాలి. నా భార్య నా ఇంట్లో ఉండాలి,’ అని హెచ్చరిస్తాడు.

జ్యో నవ్వుతూ సమాధానం ఇస్తుంది – ‘పది నిమిషాలు కాదు, ఇరవై నిమిషాలైనా నీ భార్య వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉంటుంది.’
దానికి కార్తీక్ ప్రశాంతంగా చెబుతాడు – ‘థాంక్స్ జ్యోత్స్న.’
ఆ మాటకు జ్యో ఆశ్చర్యపడి అడుగుతుంది – ‘ఏమిటి థాంక్స్?’
కార్తీక్ చెబుతాడు – ‘ఎందుకంటే నువ్వు తొలిసారి నా దీపను నా భార్య అని పిలిచావ్. వినడానికి బాగుంది. అందుకే థాంక్స్. కానీ నువ్వు తగ్గనంటావ్ కదా? సరే, నువ్వు నిజంగా శివన్నారాయణ గారి మనవరాలైతే, ఇంకో పావుగంట అక్కడే ఉండు. భయమంటే ఏమిటో చూపిస్తాను,’ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
ఇక దశరథ్, సుమిత్ర ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ‘నువ్వు కాంచన ఇంట్లో ఉన్నావని కార్తీక్ చెప్పలేదు’ అని అడుగుతాడు దశరథ్. సుమిత్ర మృదువుగా – ‘నేనే చెప్పొద్దన్నాను’ అంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. దశరథ్ చెబుతాడు – ‘సుమిత్ర, నువ్వే నా జీవితం. నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదు.’
ఇంతలో కార్తీక్ చిరునవ్వుతో లోపలికి వస్తాడు. ‘ఇలా ముందే మాట్లాడుకుని ఉంటే, ఇవన్నీ జరిగేవే కావు. సరే, ఇంటికి వెళ్దాం. కానీ ముందు ఒక పని ఉంది,’ అని చెబుతాడు. దశరథ్ ఆశ్చర్యపడి – ‘ఏంటది?’ అని అడుగుతాడు. కార్తీక్ నవ్వుతాడు. అక్కడితో ఆ సీన్ ముగుస్తుంది.
ఇక పోలీస్‌స్టేషన్‌లో జ్యో గడియారం చూస్తూ ‘బావ ఇచ్చిన పావుగంటలో ఇప్పటికి 14 నిమిషాలు అయ్యాయి’ అని కఠినంగా అంటుంది. దీప అంటుంది ‘ఒక్క నిమిషం చాలు ఏదయినా జరగడానికి’. ‘పదిహేను నిమిషాలు అయ్యాయి, ఎఫ్ఐఆర్ రాయండి, జైలులో వేయండి’ అని పోలీస్‌లను ఆదేశిస్తుంది జ్యో.
అప్పుడే బయట నుంచి గట్టిగా అరుస్తూ పారు లోపలికి వస్తుంది. ఆమె వెనుక శివన్నారాయణ గారు కూడా ఆవేశంగా వస్తారు. జ్యోత్స్న ఆనందంగా చెబుతుంది – ‘తాతా, మీరు సరైన టైమ్‌కి వచ్చారు. దీప అమ్మని కిడ్నాప్ చేసింది, అందుకే కంప్లైంట్ ఇచ్చాను.’
కానీ శివన్నారాయణ ఒక్కసారిగా గట్టిగా – ‘నోరు మూయ్!’ అని అంటారు. జ్యోత్స్న ఆశ్చర్యపోతూ, తాత నువ్వు కూడా వాళ్లకు మద్దతు ఇస్తున్నావా అని అంటుంది. శివన్నారాయణ SIతో కోపంగా చెబుతాడు – ‘శివన్నారాయణ కూతురు అని తెలిసీ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టావా?’ అని. అక్కడున్నవాళ్లు నిశ్శబ్దంగా నిలబడిపోతారు. జ్యోత్స్న బిత్తరపోతుంది.
అక్కడితో ఆ సీన్ ముగుస్తుంది. తరువాతి భాగంలో ఏమవుతుందో చూడాలి.
