కార్తీక దీపం ఏప్రిల్ 14 , 2026 మంగళవారం ఎపిసోడ్: ఇవాళ ఎపిసోడ్లో ముందుగా జ్యోత్స్న – దీప – కార్తిక్ మధ్య జరిగిన మాటల తగవు మరింత తీవ్రంగా మారుతుంది. జ్యోత్స్న తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గనని, కార్తిక్ జీవితంలో భార్యగా ఉండేది తానే అని ధైర్యంగా చెబుతుంది. దీప దీనికి ఎదురుగా “భార్యగా ఉండాలంటే పెళ్లి కావాలి” అని స్పష్టంగా చెప్పి తన స్థానం గురించి నిలదీస్తుంది. దీనికి జ్యోత్స్న వెంటనే స్పందిస్తూ, త్వరలోనే కార్తిక్ చేత తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంటానని అంటుంది.
జ్యోత్స్న తన దగ్గర కుటుంబం, ఆస్తి, పరువు అన్నీ ఉన్నాయని చెబుతూ, దీపను “నీ దగ్గర ఏం ఉంది?” అని ప్రశ్నిస్తుంది. దీప దీనికి తగ్గకుండా, కార్తిక్ తనతో ఉన్నాడని, తన జీవితంలో అతని స్థానం ఏంటో చెప్పి గట్టిగా సమాధానం ఇస్తుంది. ఇద్దరూ తమ తమ వైపు తగ్గకుండా మాట్లాడుతుండగా, జ్యోత్స్న ఒక్కసారిగా దీప ముందు ఒక ఆఫర్ గురించి మాట్లాడుతుంది.
ఆ ఒప్పందం ప్రకారం, తన దగ్గర ఉన్న కుటుంబం, ఆస్తి అన్నీ దీపకి ఇస్తానని, బదులుగా కార్తిక్‌ను ఇవ్వమని చెబుతుంది. కార్తిక్ అసలు అవి ఇవ్వడానికి అవి నీవి కాదు దీపేవి అని చెప్తూ దీనిని వెంటనే తిరస్కరిస్తాడు. జ్యోత్స్న మాత్రం ఈ ఆఫర్‌ని అంగీకరించకపోతే ఎవ్వరినీ సుఖంగా ఉండనివ్వనని హెచ్చరిస్తుంది. దీప కూడా తన నిర్ణయాన్ని మార్చకుండా, జ్యోత్స్న ఆలోచనలు తప్పు అని చెబుతుంది. చివరికి ఇద్దరి మధ్య “నేను వదలను – నేను కూడా వదలను” అన్న స్థాయికి మాటలు చేరతాయి.
ఇలా గొడవ ముగిసిన తర్వాత, ఇంటి దగ్గర కూడా పరిస్థితి కాస్త కష్టంగానే ఉంటుంది. జ్యోత్స్న ఇంటికి వచ్చి కార్తిక్ తనను వదిలేసి వెళ్లిపోయాడని చెబుతుంది. శివన్నారాయణ ఆమెని ప్రశ్నిస్తాడు. ఆమె చెంప ఎర్రగా ఉండటం గమనించి అడిగితే, అది ఏమీ లేదని తప్పించుకుంటుంది. సుమిత్ర ఐస్ పెట్టమని చెబుతుంది. దశరథ్ మాత్రం మనసులో జరిగిన విషయాన్ని అర్థం చేసుకుంటాడు.
ఇంకా తరువాత జ్యోత్స్న – పారిజాతం మధ్య జరిగిన సంభాషణ మరింత రసవత్తరంగా ఉంటుంది. పారిజాతం జ్యోత్స్న చేసిన పనులన్నీ గుర్తు చేస్తూ, కార్తిక్‌ని ఎలా తీసుకెళ్లిందో, ఎలా నాటకం ఆడిందో ఒక్కొక్కటిగా చెబుతుంది. జ్యోత్స్నని పద్దతిగా ఉండమని చెప్తుంది. జ్యోత్స్న దీనికి సమాధానం ఇస్తూ, తనకు ఏం చేయాలో తనకు తెలుసని అంటుంది.
పారిజాతం దీప వైపు నిలబడి, ఆమెకు ఏదైనా చేయాలంటే ముందుగా తనను దాటాల్సిందే అని గట్టిగా హెచ్చరిస్తుంది. జ్యోత్స్న మాత్రం దీప వల్ల తన జీవితం మారిపోయిందని, ఆ పరిస్థితిని తిరిగి మార్చుకుంటానని చెబుతుంది. ఇద్దరి మధ్య మాటలు ఇంకా పెరిగి, జ్యోత్స్న “దీపను వదిలిపెట్టను” అని చెబితే, పారిజాతం “దీపకు ఏమైనా చేస్తే ఊరుకోను” అని గట్టిగా సమాధానం ఇస్తుంది.
మరోవైపు కాంచన కూడా ఇంట్లో ఇదే విషయం మీద ఆవేశంగా స్పందిస్తుంది. కార్తిక్‌ని ప్రశ్నిస్తూ, ఈరోజు పెళ్లిరోజు అయినా ఎందుకు ఇలా జరిగిందని అడుగుతుంది. జ్యోత్స్న ఎందుకు అతన్ని తీసుకెళ్లిందో కూడా ప్రశ్నిస్తుంది. కార్తిక్ సర్దిచెప్పడానికి ప్రయత్నిస్తాడు. దీప కూడా పరిస్థితిని సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. కాంచనకి జ్యోత్స్న మీద అనుమానం వచ్చింది అని కార్తీక్ గ్రహిస్తాడు.
ఈ ఎపిసోడ్లో చూస్తే జ్యోత్స్న పూర్తిగా తనదైన మొండితనంతోనే మాట్లాడుతుంది. ఎంత చెప్పినా వినే పరిస్థితిలో కనిపించడం లేదు. కార్తిక్, దీప ఇద్దరూ తమ వైపు నిలబడటంతో సమస్య ఇంకా పెరిగేలా ఉంది. ఇంట్లో వాళ్లకి కూడా క్రమంగా విషయం అర్థమవుతున్నట్టు ఉంది. పారిజాతం కూడా నేరుగా ఎదురు నిలబడడంతో ఇక ముందు జ్యోత్స్నాతో సీన్లు ఇంకా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది. జ్యోత్స్న ఇంకేం చేస్తుందో, దీప ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. రేపటి ఎపిసోడ్లో ఈ పరిస్థితికి ఇంకో మలుపు వచ్చే అవకాశం ఉంది.
