కార్తీక దీపం Nov 14th, 2025 శుక్రవారం ఎపిసోడ్: పగతో జ్యోత్స్న… !!! తల్లి బాధను తెలుసుకున్న కార్తీక్ … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో బోర్డు మీటింగ్‌లో ఇంట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ జ్యోత్స్న గదిలోకి వెళ్లి కోపంగా కూర్చుంటుంది. మీటింగ్‌లో జరిగిన అవమానం, అందరి ముందు తాను అవమానించబడిన క్షణం మళ్లీ మళ్లీ ఆమె కళ్లముందు తిరుగుతూ, కోపం మరియు బాధ కలిసి రగిలిపోతుంటుంది.
ఇంతలో పారిజాతం ఆమె గదిలోకి వచ్చి “జరిగిందంతా జరిగిపోయింది, వదిలేయ్. భోంచేద్దాం పద” అని అంటుంది. కానీ జ్యోత్స్న కోపంగా “ఒక పనికి రాని పనిమనిషి ముందు నన్ను అవమానించారు, అలాంటి అవమానాన్ని నేను ఎలా మర్చిపోగలను” అని అరిచి చెప్తుంది.
అలానే “అయినా బావ చేసే ప్రతి పనికీ ఏదో ఒక కారణం ఉంటుంది, దేని వెనక కూడా తప్పకుండా ఎదో బలమైన కారణం ఉండి ఉంటుంది” అని అంటుంది. పారు మాట్లాడుతూ “తప్పు అంతా నీది. నువ్వు చేసిన పనులకి మీ తాత, నాన్న లాంటి తెలివైన వాళ్ళు ఉన్నా కూడా కంపెనీని కాపాడలేకపోయారు. అయినా కూడా తప్పు చేశానన్న భావన నీలో లేదు, అదే సమస్య” అని పారిజాతం చెప్తుంది. జ్యోత్స్న మాత్రం తాను చేసిన తప్పులనుంచి పాఠాలు నేర్చుకున్నానని చెప్తూ “సరిదిద్దుకునే అవకాశం రాకముందే నన్ను పక్కకు నెట్టేశారు” అని పారుతో అంటుంది.

జ్యోత్స్న కోపంగా “నన్ను ఓడించాలని ప్రయత్నించిన వారిని వదలను. ముఖ్యంగా దీపను, బావను ప్రశాంతంగా ఉండనివ్వను. వాళ్లిద్దరికీ జ్యోత్స్న అంటే ఏమిటో త్వరలో అర్థమవుతుంది” అని పారిజాతంతో అంటుంది. పారిజాతం ఆ మాటలు విని షాక్ అయ్యి సైలెంట్ గా ఉంటుంది.
ఇదే సమయంలో మరోవైపు, దీప పాలు తీసుకుని గదిలోకి వస్తుంది. కార్తీక్ కొంచం కోపంతో ఉంటాడు. దీప అది గమనించి “అత్తని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడగడం తప్పా” అని అడుగుతుంది. కార్తీక్ తనలోని బాధను బయటపెడుతూ “తల్లిదండ్రుల మధ్య ఏం జరిగిందో, ఎందుకు వాళ్లు వేరుపడ్డారో, ఆ దూరం ఎలా వచ్చిందో పక్కన పెడితే, పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులు కలిసుండాలని కోరుకుంటారు కదా. మీ తల్లిదండ్రులు విడిపోతే నువ్వు చూడలేకపోయావు. వాళ్లిద్దరినీ కలిపే వరకు నువ్వు, నేను సరిగా నిద్రపోలేదు. మరి నేను కూడా అలానే కోరుకుంటాను కదా న తలిదండ్రులు గురించి” అని చెప్తాడు.

“మా తాత ఇప్పటికే మా నాన్నని క్షమించాడు, కానీ మా అమ్మ ఎప్పుడు ఆయనను దగ్గర చేసుకుంటుందో తెలియదు. మన కుటుంబం మళ్లీ ఒక్కటిగా అవ్వాలి, అందులో అమ్మానాన్న కూడా ఉండాలి” అని కార్తీక్ దీపతో చెప్తాడు. దీప అతని మనసు అర్థం చేసుకుని, తనను తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమాపణలు అడిగింది. కార్తీక్ అయితే “పైకి చెప్పకపోయినా, అమ్మానాన్న ఒకరినొకరు తలచుకుంటూనే ఉంటారు” అని గట్టిగా నమ్ముతున్నానని అంటాడు.
అదే సమయంలో శ్రీధర్ గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు. చేతిలో కాంచన ఫోటో ఉంటుంది. ఆమెను చూస్తూ పాత జ్ఞాపకాలు అతని మనసులోకి వస్తాయి. అటు కాంచన కూడా తన గదిలో భర్తను తలచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇద్దరూ ఫోన్ చేయాలని అంటారు. చివరికి శ్రీధర్ ధైర్యం చేసి కాంచనకు కాల్ చేశాడు.

ఫోన్ ఎత్తగానే అతను “నా కాల్ కోసం ఎదురు చూస్తున్నావా?” అని అడుగుతాడు. ఆమె “మీ కాల్ కోసం కాదు” అని చెప్తుంది. “అయితే మొదటి రింగ్‌కే ఎందుకు లిఫ్ట్ చేశావు?” అని ప్రశ్నిస్తాడు. ఆమె “కార్తీక్ కోసం చేసారు ఏమో అనుకుని లిఫ్ట్ చేశాను” అని చెప్తుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన కార్తీక్ వారి మాటలు వింటూ ఉంటాడు.
శ్రీధర్, జీవితంలో కొన్ని విషయాలు అనుకోవడంతోనే మిగిలిపోతాయని అంటూ “కంపెనీలో ఏం జరిగిందో కార్తీక్ చెప్పి ఉంటాడు. నన్ను విష్ చేయాలని కూడా అనిపించలేదా?” అని అడుగుతాడు. ఆమె “ఎవరి శుభాకాంక్షలకో ఎదురుచూడాల్సిన అవసరం మీకు ఏముంది?” అని ప్రశ్నిస్తుంది.
శ్రీధర్, “నీకు అవసరం లేదేమో, కానీ నేను ఎదురుచూస్తాను కదా” అంటాడు. కాంచన “రాకపోయే వారి కోసం ఎదురు చూడటం వ్యర్థం” అని చెప్తుంది. ఆమె తన గతం గురించి, తనను బాధపెట్టిన సందర్భాలను గుర్తుచేసుకుంటుంది.

శ్రీధర్ “మావయ్య కూడా నన్ను క్షమించాడు, నువ్వు ఎందుకు చేయలేవు?” అని అడుగుతాడు. ఆమె “నా తండ్రి కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని నమ్మాను. క్షమించడానికి మనసు కావాలి, కానీ అది ఇప్పుడు లేదు చనిపోయింది” అని చెప్తుంది. “నా తలరాత దేవుడు ఎడమ చేత్తో రాసినట్టున్నాడు అందుకే నా జీవితంలో అందరు ఉండి కూడా ఇలా ఒంటరిగా ఉన్నాను. తల్లి లేకుండా పెరిగానని, సంతోషంగా ఉన్న సమయంలో కాళ్ళు పోగొట్టుకున్నాను, భర్త ఉండి కూడా లేకుండా బ్రతుకుతున్నాను” అని బాధపడుతుంది.
శ్రీధర్ కాంచనని “మనం మళ్లీ కలవలేమా” అని అడుగుతాడు దానికి కాంచన మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. శ్రీధర్ నా భార్యతో అని సమాధానమిస్తాడు. దానికి కాంచన “మీ భార్య మీ ఇంట్లోనే ఉంది” అని చెప్తుంది. దానికి శ్రీధర్ “మరి నీ భర్త ఎవరు?” అని ప్రశ్నించడంతో ఆమె “సీఈఓ అయినందుకు మీకు శుభాకాంక్షలు” అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. శ్రీధర్ తన చేతిలో ఫోన్ పట్టుకుని, “నీ కన్నీళ్లు ఈ జన్మలో తుడవగలనా?” అని మనసులో బాధ పడతాడు.

ఈ సంభాషణను విన్న కార్తీక్, తన తల్లి దగ్గరకు వెళ్తాడు. కార్తీక్ ని చూసి ఇంకా పడుకోలేదు అని కాంచన అడుగుతుంది. దానికి కార్తీక్ “నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అమ్మ. ఆయన ఎం మాట్లాడాడో నాకు తెలీదు కానీ నువ్వు మాట్లాడింది అంతా నేను విన్నాను. నీకు నేను ఉన్నాను అమ్మ” అని చెప్తాడు. తన తల్లి ఇంకా కన్నీళ్లు తుడుచుకుంటూనే ఉంటుంది.
తన తండ్రితో కలవడం గురించి అడిగిన కార్తీక్ తో కాంచన “ఒక ఆడది తన తండ్రి దగ్గర గెలవలేకపోతే తన భర్త దగ్గర గెలవాలి అనుకుంటుంది. అక్కడ కూడా గెలవలేకపోతే పిల్లల దగ్గర గెలవాలి అనుకుంటూనే. నేను నా తండ్రి , నా భర్త ఇద్దరి దగ్గర గెలిచాను. కానీ నా భర్త నా గర్వాన్ని చంపేశాడు, నా విజయాన్ని పాతిపెట్టేశాడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళలేను ముందులా ఉండలేకపోతున్నాను. కానీ నిన్ను చూసుకునే మొండిగా బ్రతుకుతున్నాను. కొడుకుగా నువ్వు నాకు తోడుగా ఉన్నావు ” అని చెప్తుంది.

దానికి కార్తీక్ “నువ్వు ఎం తప్పు చేయలేదు కదా” అని అంటాడు. కాంచన మాట్లాడుతూ ఈ సమాజం భర్త తప్పులకి కూడా భార్యనే నిందిస్తారు అని అంటుంది. కార్తీక్ ఆమెతో “నాన్న చాలా తప్పులు చేశాడు, కానీ ఇప్పుడు మారాడు. నా కోసం పది కోట్లు కట్టడానికి ఆయన క్షణం కూడా ఆలోచించలేదు. ఆ మనిషిలో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తోంది” అని అంటాడు. “ఆయనకి మన మీద కోపం లేదు, ఆయన కోపం దీప మీద ఉంది. ఆమె నా ప్రాణదాత అని తెలిసిన తర్వాత ఆ కోపంలో సగం తగ్గిపోయింది” అని చెప్తాడు. తల్లికి ధైర్యం చెప్పుతూ “కోపమైనా, ద్వేషమైనా, దూరమైనా ఒక రోజు పోతాయి. నువ్వు ఎప్పుడూ తలెత్తుకుని ఉండాలి” అని అన్నాడు.
కాంచన తన కొడుకును హత్తుకుని నిశ్శబ్దంగా కన్నీళ్లు తుడుచుకుంటుంది. తన మనసులో “నాకు తెలుసు నువ్వు నేను మీ నాన్న కలిసి ఉండాలి అని కోరుకుంటున్నావు. ఆరోజు ఈ జన్మలో రాదు” అని అనుకుంటుంది.
అక్కడితో ఆ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
