కార్తీక దీపం Nov 18th, 2025 మంగళవారం ఎపిసోడ్: పారు, జ్యోత్స్న లకి శివన్నారాయణ ఇచ్చిన పనిష్మెంట్ …. !!! ఒక ఆటాడుకున్న శ్రీధర్ కుటుంబం … !!!
ఎపిసోడ్ ప్రారంభంలో జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కలిసి శ్రీధర్ని అవమానించి ఇంటి నుంచి పంపిన తర్వాత దీప తీవ్రంగా బాధపడుతుంది. ఆమె కార్తీక్‌కు తన మనసులో ఉన్న బాధలు చెబుతూ, ఈ ఇంట్లో జ్యోత్స్న ఎప్పటికీ మారదని అంటుంది. మామయ్య గారి రెండో పెళ్లి గురించి అడిగే హక్కు జ్యోత్స్నకి ఏమిటి, అలాంటి మంచి మనిషిని పట్టుకుని అంతలా అవమానించడం ఎంత తప్పో అంటూ దీప బాధపడుతుంది. మామయ్యగారు సాధారణంగా అయితే వదిలేవారు కాదని, కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయారని, పైగా ఆ మార్పు అంతా తన కోసమేనని దీప చెబుతుంది. తాతయ్య కావేరి అత్తను పిలవమని చెప్పినప్పుడు తనకు ఎంత ఆనందంగా అనిపించిందో చెప్తూ, కానీ ఆ ఆనందాన్ని కూడా క్షణాల్లో జ్యోత్స్న, పారిజాతం చెడగొట్టారని ఆమె బాధపడుతుంది.

కార్తీక్ ఆమెను ఓదారుస్తూ, వాళ్లు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగడం లేదని, జ్యోత్స్న ఉండాల్సిన ప్లేస్‌లో ఇప్పుడు మా నాన్న ఉన్నారని, ఇంకా దీప ఐడియా చెప్పడం అది అందరికి నచ్చడం వాళ్ళకి గట్టి దెబ్బ తగిలింది అని, అందుకే వాళ్లు ఈ చిన్న చిన్న విషయాల్ని మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కార్తీక్ అంటాడు. దీప మాత్రం హోమానికి అందరి బంధువులు రావాలని తాతయ్య కోరుకున్నారని, గురువుగారు కూడా కుటుంబం మొత్తం హోమానికి రావాలని చెప్పారని గుర్తుచేసుకుంటూ ఇవి అసలు జరగవని అంటుంది. కార్తీక్ మాత్రం అన్నీ జరుగుతాయని, దీప ఎలాంటి టెన్షన్ పడకూడదని మాటిస్తాడు. పారు, జ్యోత్స్న ఇలా రెచ్చిపోతారని ఎవ్వరూ ఊహించలేదనీ, ఇప్పుడు తాతయ్య పేరు చెప్పి వాళ్లకి గుణపాఠం చెబుతానని కార్తీక్ నిర్ణయించుకుంటాడు.
మరో వైపు సుమిత్ర జ్యోత్స్న ప్రవర్తనపై చాలా బాధపడుతుంది. రోజురోజుకూ జ్యోత్స్న మొండితనం పెరుగుతుందని, ఇలా వదిలేస్తే అత్తయ్య మాటలే వింటూ పనికిరాని వ్యక్తిగా మారిపోతుందని దశరథతో చెప్తుంది. దాంతో ఆమె వెంటనే జ్యోకి పెళ్లి సంబంధం చూడాలని చెప్తుంది. దశరథ మాత్రం త్వరపడితే గౌతమ్ విషయంలో జరిగిన పొరపాట్లు మళ్లీ జరుగుతాయని చెబుతాడు. జ్యోత్స్న జీవితానికి పెళ్లి విషయంలో మరో పొరపాటు పెద్ద నష్టం చేస్తుందని అభిప్రాయపడతాడు. గురువు గారు ఇంటికి కీడు అన్నారు కదా, హోమానికి శ్రీధర్ రాకపోతే ఎలా అన్న ఆందోళనను సుమిత్ర బయటపెడుతుంది. దశరథ కూడా తనలో భయం ఉన్నా బయట ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు. హోమం ముగిశాక జ్యోత్స్న విషయంపై ఒక నిర్ణయం తీసుకుందాము అని అంటాడు.

ఇంతలో దీప వచ్చి దశరథతో మాట్లాడుతుంది. దశరథ ఆమెను కూతురిలా భావిస్తున్నానని, తమ స్వంత కూతురుకంటే దీప ఎక్కువ ప్రేమ చూపిస్తుందంటూ అభిమానం వ్యక్తం చేస్తాడు. జ్యోత్స్న ఏమైనా అన్నా అది తన చెల్లి అన్నట్టే అనుకుని పట్టించుకోవద్దని చెబుతాడు. గురువు గారు చెప్పిన విపత్తు గురించి సుమిత్ర ఆందోళనలో ఉన్నప్పటికీ, దశరథ ఆ బాధ్యతంతా దీప, కార్తీక్‌లకు అప్పగిస్తాడు. హోమం నిర్విఘ్నంగా జరగాలని మాత్రం చెబుతాడు. దీప కార్తీక్ తనతో చెప్పిన మాట దశరథతో చెప్పడంతో — ఈ ఇంటికి ఏ ఆపద రాదన్న నమ్మకం దశరథను కొంత శాంతింపజేస్తుంది.
ఇంతలోగా పారిజాతం చాలా గర్వంగా, ఎన్నో రోజుల తర్వాత ఈ ఇంట్లో తమ గొంతు మళ్లీ గట్టిగా వినిపించింది అని అంటుంది. అప్పుడే కార్తీక్ వచ్చి తాతగారు పిలుస్తున్నారని చెబుతాడు. పారిజాతం, తాతకు భయపడే రోజులు పోయాయని, ఇప్పుడే వెళ్లి ఆయన అంతు చూస్తానని అంటుంది. కానీ శివన్నారాయణ వారికి నేరుగా చెప్తాడు — శ్రీధర్ కుటుంబాన్ని హోమానికి పిలవాలని. వాళ్లు రావాలి అన్నది తన నిర్ణయం, తాను పిలిచాడు, కానీ పారిజాతం అవమానించింది. కాబట్టి పిలిచేది కూడా వాళ్లే, అంటే జ్యోత్స్న, పారులే వెళ్లి శ్రీధర్ కుటుంబాన్ని గౌరవంగా పిలవాలని ఆదేశిస్తాడు.

పారిజాతం “పిలవకపోతే?” అని అడగగానే పెద్దాయన స్పష్టంగా “ఇప్పుడే నీ వస్తువులు తీసుకుని ఈ ఇంటి నుంచి వెళ్లిపోవచ్చు” అని చెబుతాడు. ఆ మాట ఇద్దరినీ షాక్‌లోకి నెడుతుంది. జ్యోత్స్న నేరుగా పిలవడానికి నేను రానని చెప్పడంతో , శివన్నారాయణ ఆ బాధ్యత అంతా “మీ గ్రానీ”దేనని అంటూ కార్తీక్ తో “శ్రీధర్ కుటుంబం రావడానికి అంగీకరించకపోతే పారిజాతంని ఎక్కడ అయినా గుడిలో వదిలేసి జ్యోత్స్న ని మాత్రమే ఇంటికి తీసుకుని రా” అని అంటాడు. చివరకు ఇష్టంలేకపోయినా ఇద్దరూ వెళ్లాల్సి వస్తుంది.
శ్రీధర్ ఇంటి వద్దకు పారు–జ్యోత్స్నలు చేరేసరికి శ్రీధర్ ఒక్కడే కూర్చుని జరిగిన అవమానం గుర్తు చేసుకుని బాధ పడుతూ ఉంటాడు. కార్తీక్ తలుపు కొట్టగానే బయటికి వచ్చి చూసి కార్తీక్ ని మాత్రమే లోపలికి పిలుస్తాడు కానీ పారిజాతం, జ్యోత్స్నను మాత్రం తలుపు ముందే ఆపేసి వాళ్ళు ఎవరో తనకి తెలియదని అంటాడు. పారిజాతం నేను మీ అత్తయ్యని అంటుండగా తన అత్తయ్య చనిపోయి చాల కాలం అయింది అని ముక్కు ముఖం తెలియని వాళ్లతో సంప్రదింపు లేదని కౌంటర్ వేస్తాడు. జ్యోత్స్న బయట నిలబడి పారిజాతంతో ఎలా అయినా ఒప్పించి శ్రీధర్‌ను హోమానికి వచ్చేలా చేయాలి వచ్చాక వాళ్ళ సంగతి చెప్పాలి అని ప్లాన్ చెబుతుండగా కార్తీక్ వింటాడు.

కార్తీక్ పారుని గుడిలో వదిలేస్తా అని బెదిరిస్తుండటంతో శ్రీధర్ పిలవకపోయినా పారు, జ్యోత్స్న ఇంట్లోకి వెళ్లి శ్రీధర్ ని బ్రతిమిలాడుతూ ఉంటారు. కానీ శ్రీధర్ రాను అని గట్టిగా చెప్తుండటంతో అపుడే అక్కడికి వచ్చిన కావేరి, స్వప్న, కాశిని చూసి చూడండి ఎం అవుతుందో ఇక్కడ అని అంటుంది పారు. దానికి కావేరి ఇక్కడ జరిగింది చూస్తున్నాను అక్కడ జరిగింది విన్నాను అని అంటుంది. ఆ మాటలతో పార్, జ్యోత్స్నలు గతుక్కుమంటారు.
వెంటనే కాశి స్వప్నతో ఇంటికి వచ్చిన మనిషిని నిలబెట్టకుండా కూర్చోబెట్టి కాఫీ ఇవ్వమని చెప్తాడు. పారు మాత్రం ఆ మాటను తప్పుగా కాశి తమ పక్షాన మాట్లాడుతున్నాడని భావిస్తే, కాశి స్పష్టంగా తను చెప్పింది బావ గురించి అని చెబుతాడు. అది విని ఇద్దరూ మరింత సిగ్గుతో తలదించుకుంటారు.

ఇక చివరగా పారు–జ్యోత్స్నలు హోమానికి రావాలని మరోక్కసారి అందరిని ఆహ్వానిస్తారు. కాని శ్రీధర్ ఏ మాత్రం తగ్గకుండా “మేము హోమానికి రాము” అని స్పష్టంగా చెప్పేస్తాడు.
ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Source inspiration: Original story from “కార్తీక దీపం” (JioHotstar). This is a personal written recap and interpretation.
