గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏప్రిల్ 16 , 2026 గురువారం ఎపిసోడ్: తండ్రిపై ప్రేమని బయట పెట్టిన బాలు … బాలు ప్రేమని చూసి కన్నీరు పెట్టుకున్న సత్యం … !!!
ఇవాళ ఎపిసోడ్లో ముందుగా సత్యం ఉద్యోగం ప్రారంభించిన విషయంపై ఇంట్లో చర్చ జరుగుతుంది. బాలు ఎంతగా ఆపడానికి ప్రయత్నించినా, సత్యం మాత్రం తన నిర్ణయంపై నిలబడుతాడు. ఈ వయసులో కూడా పని చేయడం తనకు ఇష్టం అని చెప్పి, రోజుకు ఒక గంటైనా పని చేస్తానని స్పష్టం చేస్తాడు. మనోజ్ మాత్రం తన దృష్టిలో తండ్రి ఉద్యోగం గురించి చులకనగా మాట్లాడుతుండగా, బాలు అతనికి బుడ్డి చెప్పి, తండ్రి పరిస్థితిని అర్థం చేసుకోమని చెబుతాడు. ఈ సందర్భంలో కూడా ఇది అంతా తన వల్లనే అని ప్రభావతి తన తప్పును ఒప్పుకోకుండా బాలుని తప్పు పడుతుంది ఎప్పటిలానే.
ఇలా జరుగుతుండగా, సత్యం పిల్లలకు నీతి కథలు చెప్పే సన్నివేశం చూపిస్తారు. పంచతంత్రం గురించి చెప్పుతూ, పిల్లలకు జీవన విలువలు నేర్పించే విధానం చాలా సహజంగా, అర్థవంతంగా ఉంటుంది. ఈ పని ద్వారా సత్యం తనకు తాను సంతృప్తి పొందుతున్నట్టు తెలుస్తుంది. బయటికి చూస్తే ఇది చిన్న పని లాగా కనిపించినా, సమాజానికి ఉపయోగపడే పని అనే భావన స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తరువాత రంగా రావు చెప్పిన మాటల ద్వారా, ఈ ఉద్యోగం వెనుక బాలు ఏర్పాటు చేసిన సహాయం ఉందని తెలుస్తుంది. అంటే సత్యం గౌరవం దెబ్బతినకుండా ఉండేలా బాలు పరోక్షంగా సహాయం చేస్తున్నాడన్న విషయం ఇక్కడ బయటపడుతుంది.
మరో వైపు, బాలు చింటూ ఇంటికి వెళ్లడం ద్వారా కొత్త మలుపు మొదలవుతుంది. అక్కడ ఇంటికి తాళం వేసి ఉండటం, వారు ఎక్కడికో వెళ్లిపోయారని తెలిసిన తర్వాత బాలు అనుమానపడతాడు. ఫోన్లో సుగుణమ్మ మాట్లాడే తీరు కూడా అనుమానాస్పదంగా ఉండటం, అసలు విషయం ఏదో దాచిపెడుతున్నారన్న భావనను పెంచుతుంది. ముఖ్యంగా “మమ్మల్ని కలవొద్దు” అని చెప్పడం బాలు మనసులో మరింత సందేహాలను రేకెత్తిస్తుంది.
ఇంకా మరోవైపు, రోహిణి కొత్త ఇంట్లో చింటూని స్కూల్లో చేర్పించడానికి ఏర్పాట్లు చేస్తుంది. బయట ప్రపంచంతో చింటూ ఎక్కువగా కలవకుండా చూసే ప్రయత్నం చేస్తూ, అతన్ని ఇంటి పరిధిలోనే ఉంచాలని చూస్తుంది. అలానే బాలుకి దూరంగా ఉండమని తనతో కఠినంగా మాట్లాడేలా సుగుణమ్మకి చెప్తుంది. ఈ వ్యవహారంలో రోహిణి ప్రవర్తన చూసి సుగుణమ్మ ఆందోళన చెందుతుండగా, రోహిణి మాత్రం కఠినంగా నిర్ణయం తీసుకుని బాలను దూరంగా ఉంచాలని చూస్తుంది.
ఇలా జరుగుతుండగా, బాలు మరియు మీనా మధ్య జరిగిన సంభాషణలో ఈ అనుమానాలు మరింత స్పష్టమవుతాయి. సుగుణమ్మ ఇంతగా మారిపోయే వ్యక్తి కాదని, ఆమె మాటల్లో సహజత్వం కనిపించలేదని బాలు చెబుతాడు. బొమ్మల కొలువు దగ్గర కూడా ఆమె మాటలు బలవంతంగా మాట్లాడినట్టు అనిపించిందని గుర్తు చేస్తాడు. చింతూ గురించి ఇంకా పూర్తిగా తెలియదని, అతని జీవితంలో ఏదో రహస్యం దాగి ఉందని బాలు అనుమానపడతాడు. మొదట మీనా ఈ విషయాన్ని పెద్దగా తీసుకోకపోయినా, బాలు చెప్పే విధానం చూస్తే ఆమె కూడా ఆలోచనలో పడుతుంది.
చివరగా, బాలు–సత్యం మధ్య జరిగిన సంభాషణ ఈ ఎపిసోడ్‌కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. సత్యం తన కొడుకు చేసిన సహాయాన్ని గుర్తించి, ఈ వయసులో తన కోసం ప్రత్యేకంగా పని ఏర్పాటు చేసి, తనే జీతం ఇస్తున్నాడని తెలుసుకుని భావోద్వేగానికి లోనవుతాడు. తన తండ్రి గురించి మాట్లాడుకుంటూ, బాలు లో కనిపించే ఆ మనసు తన తండ్రి మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందని చెప్పడం ద్వారా అతని గుండెలో నిండిన భావాలు బయటపడతాయి. తన కోసం బాలు ఇంతగా ఆలోచించాడని తెలుసుకుని, ఒక తండ్రిగా గర్వం, ఆనందం, బాధ అన్నీ కలిసిన భావనలో కనిపిస్తాడు.
అదే సమయంలో బాలు కూడా తన మనసులోని భావాలను బయటపెడతాడు. చిన్నప్పటి నుంచి తండ్రి తనపై చూపిన ప్రేమ, జాగ్రత్త, క్రమశిక్షణ గురించి గుర్తు చేసుకుంటాడు. తండ్రి తనకు తల్లి లాంటి ప్రేమ కూడా ఇచ్చాడని, తాను ఈ ఇంట్లో నిలబడటానికి కారణం ఆయనే అని చెబుతాడు. అందుకే ఇప్పుడు ఆయన ఈ వయసులో కష్టపడకూడదని, విశ్రాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ ఏర్పాట్లు చేశానని స్పష్టం చేస్తాడు. తండ్రి చేసిన ప్రతి చిన్న సహాయం తన జీవితాన్ని ఎలా మార్చిందో చెప్పడం ద్వారా ఆ బంధం లోతు తెలుస్తుంది.
ఇదే సమయంలో మీనా ఈ తండ్రి–కొడుకు అనుబంధాన్ని చూసి, చాలా ఆనందిస్తుంది. బాలు ఆనందంగా తన తండ్రి గురించి మాట్లాడుతుంటే, అతన్ని చూసి తాను కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయానని చెబుతుంది. ఇలాంటి బంధం చాలా అరుదని, ఈ రోజుల్లో తండ్రిని పట్టించుకోకుండా వదిలేసే కొడుకులు ఉన్న సమయంలో, బాలు లాంటి వ్యక్తి ఉండటం నిజంగా అదృష్టమని భావిస్తుంది. సత్యం కళ్లలో కనిపించిన ఆనందం, బాధ, గర్వం—అన్ని ఒకేసారి బయటపడినట్టు ఆమె చెబుతుంది. తాను ఇలాంటి కుటుంబంలో కోడలిగా రావడం కూడా తన అదృష్టమేనని చెప్పడం ద్వారా ఆ సన్నివేశం మరింత సహజంగా ముగుస్తుంది.
ఈ ఎపిసోడ్లో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా చూపించారు, ముఖ్యంగా బాలు–సత్యం ట్రాక్ చాలా బాగా అనిపించింది. అయితే చింటూ రోహిణి ట్రాక్ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది — అక్కడ ఏదో పెద్ద విషయం దాచిపెడుతున్నారన్న ఫీలింగ్ బాలుకి స్పష్టంగా ఉంది. రోహిణి కూడా దొరికిపోతాను అనే భయంతో ఉంది. రాబోయే ఎపిసోడ్స్‌లో ఈ రహస్యం బయటపడితే కథ మరింత ఇన్ట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది.
