గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ మే 14, 2026 గురువారం ఎపిసోడ్: మీనాని ఇబ్బంది పెడుతున్న చింతామణి … !!! ప్రభావతిని భయపెట్టిన కామాక్షి …!!!
ఇవాళ ఎపిసోడ్లో ముందుగా భోజన సమయంలో ఇంట్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. రోహిణి కూడా భోజనానికి కూర్చోవడానికి రావడంతో ప్రభావతి వెంటనే ఆమెను లేవమంటుంది. మనోజ్ మాత్రం “తనకూ ఆకలి వేస్తుంది” అని చెప్పడానికి ప్రయత్నించినా, ప్రభావతి అతనిని కూడా గట్టిగా ఆపేస్తుంది. ఈ సమయంలో బాలు మాత్రం పరిస్థితిని తన స్టైల్లో పోల్చుతూ, పిల్లలు ఆడుకున్న బొమ్మలు విరిగిపోయాక పక్కన పడేసినట్టు ఇప్పుడు రోహిణిని ప్రభావతి పక్కన పడేసింది అన్నట్టుగా మాట్లాడుతాడు. మనోజ్‌కు అది ఎగతాళిలా అనిపించినా, బాలు మాత్రం తాను నిజం మాత్రమే చెబుతున్నానని అంటాడు.
ఇదిలా ఉండగా, మీనా మాత్రం రోహిణిని తిరిగి కూర్చొని తినమని అడుగుతుంది. మనోజ్ మీనా, బాలుని తప్పు పట్టగా మామగారి డబ్బులు దాచిపెట్టింది తాము కాదని, అయినా ఇప్పుడు అందరి కోపం తమ మీదకూ వస్తోందని చెబుతుంది. రవి కూడా వదినను అలా లేపేయడం సరైంది కాదని ప్రభావతితో అంటాడు. కానీ రోహిణి మాత్రం “అత్తయ్య కోపం తగ్గే వరకు ఈ ఇంట్లో తినను” అని చెప్పి బయటకు వెళ్లిపోతుంది. తనకి అమ్మ లేదని, ఇక్కడ తన గురించి ఆలోచించే వాళ్లు ఎవరూ లేరనే బాధను బయటపెడుతుంది. మనోజ్ వెనక వెళ్లడానికి ప్రయత్నించగానే ప్రభావతి మళ్లీ అతన్ని ఆపేస్తుంది.
ఇంకా తర్వాత, రోహిణి కామాక్షి ఇంటికి వెళ్తుంది. కామాక్షి ఆమెను ఓదార్చుతూ, బాధలో ఉన్నా తినకుండా ఉండకూడదని చెబుతుంది. రోహిణి మాత్రం తాను చేసినది అంతా మనోజ్ కోసమేనని, కానీ ఇప్పుడు అందరూ తననే తప్పుగా చూస్తున్నారని బాధపడుతుంది. కామాక్షి కూడా ప్రభావతి కోపానికి అసలు కారణం డబ్బు దాచడం కాదని, రోహిణి చెప్పకుండా దాచిపెట్టడమేనని వివరిస్తుంది. రోహిణిని ఇప్పటికీ ప్రభావతి సొంత కూతురిలానే చూస్తోందని, అందుకే ఎక్కువగా బాధపడుతోందని చెబుతుంది. రోహిణి మాత్రం ఇప్పుడు ఆ ఇంట్లో అందరూ పరాయివాళ్లలా కనిపిస్తున్నారని అంటుంది. కానీ కామాక్షి మాత్రం ఇంటి నుంచి బయటకు రావడం సులభం కానీ, మనల్ని ప్రేమించే వాళ్ల మనసుల్లోంచి బయటకు రావడం కష్టం అని చెప్పి తిరిగి ఇంటికి వెళ్లమని సలహా ఇస్తుంది. రోహిణి తన గురించి ప్రభావతితో మాట్లాడమని కోరుతూ, ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ కూడా రాసి ఇస్తుంది.
ఇదిలా ఉండగా, ఫంక్షన్ హాల్ దగ్గర మీనా కొత్త డెకొరేషన్ ఆర్డర్ కోసం ప్రయత్నిస్తుంది. బాలు కూడా ఆమెతో కలిసి వెళ్లి ధైర్యం చెబుతాడు. కానీ అక్కడికి వచ్చిన చింతామణి మళ్లీ మీనాను అవమానించే ప్రయత్నం చేస్తుంది. మీనా చేసిన డిజైన్స్ ని చిన్నచూపు చూస్తూ, ఈ రంగంలో ట్రెండ్ గురించి తనకే బాగా తెలుసని గొప్పలు చెబుతుంది. మీనా మాత్రం కస్టమర్ కి నచ్చేలా ముందుగా డెమో చూపించడం తన ఆలోచన అని చెప్పి ధైర్యంగా నిలబడుతుంది. దీంతో చింతామణి మరింత కోపంతో, మీనాకు ఆర్డర్స్ రాకుండా అడ్డుకుంటానని హెచ్చరిస్తుంది. చివరకు తన మనుషులతో మీనా ఎంతో కష్టపడి తయారు చేసిన డెమో డిజైన్స్ ని ధ్వంసం చేయిస్తుంది. దీంతో మీనా తీవ్రంగా బాధపడినా, “నా పనితోనే మీకు సమాధానం చెబుతాను” అని గట్టిగా చెబుతుంది.
ఇంకా మరోవైపు, కామాక్షి ప్రభావతిని తన ఇంటికి పిలిచి మాట్లాడుతుంది. మొదట డాన్స్ స్కూల్ విషయంతో మాట మొదలుపెట్టినా, తర్వాత నేరుగా రోహిణి విషయానికే వస్తుంది. రోహిణి మనోజ్ మీద ఎంత ప్రేమతో ఆ పని చేసిందో అర్థం చేసుకోవాలని ప్రభావతిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. మనోజ్ భవిష్యత్తు కోసం షోరూం పెట్టిందని, అందులో రోహిణి ఉద్దేశ్యం చెడ్డది కాదని చెబుతుంది. అంతేకాదు, రోహిణి ధనిక కుటుంబానికి చెందిన అమ్మాయి అని, ఆమెను దూరం చేసుకుంటే ఒకరోజు మనోజ్‌ను తీసుకుని వేరే కాపురం పెట్టే పరిస్థితి రావొచ్చని కూడా సూచిస్తుంది. ఈ మాటలు విన్న ప్రభావతి బయటకు అంగీకరించకపోయినా, లోపల మాత్రం ఆలోచనలో పడుతుంది.
ఇదిలా ఉండగా, ఇంట్లో మీనా సత్యంతో మాట్లాడుతుంది. రోహిణి అసలు భోజనం చేయడం లేదని, ప్రభావతి ఇద్దరు భార్యాభర్తలను కలవనివ్వడం లేదని బాధపడుతుంది. సత్యం కూడా పరిస్థితి ఇలా సాగడం మంచిది కాదని భావిస్తాడు. ఇంతలో అక్కడికి వచ్చిన ప్రభావతి, మీనా తమ గురించి చాడీలు చెబుతోందని కోపపడుతుంది. కానీ సత్యం మాత్రం మీనా ఎప్పుడూ ఇంటి మంచికే ఆలోచిస్తుందని చెబుతాడు. చివరికి సత్యం చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతాడు — రోహిణిని తిట్టడం, కొట్టడం ఒకటే కానీ, భార్యాభర్తలను మాట్లాడుకోనివ్వకుండా దూరం చేయడం మాత్రం పెద్ద తప్పు అని హెచ్చరిస్తాడు. మనోజ్ కూడా చిన్నపిల్లాడు కాదని, రోహిణి మాట విన్నంతగా తన ఆలోచన కూడా ఉండాల్సిందేనని ప్రభావతికి గుర్తు చేస్తాడు.
