గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ మే 15, 2026 శుక్రవారం ఎపిసోడ్: షాప్ విషయంలో బాలు తీసుకున్న నిర్ణయం … !!! ఖంగుతిన్న రోహిణి, మనోజ్ …!!!
ఇవాళ ఎపిసోడ్లో ముందుగా సత్యం–ప్రభావతి మధ్య రోహిణి విషయంపై మరోసారి చర్చ జరుగుతుంది. సత్యం, తప్పు జరిగినా భార్యాభర్తలను దూరంగా ఉంచడం మంచిది కాదని ప్రభావతికి అర్థం చేయించే ప్రయత్నం చేస్తాడు. రోహిణి ఒక్కదానిదే తప్పు కాదని, మనోజ్ కూడా తన నిర్ణయాల్లో భాగమేనని చెబుతాడు. మీనా కూడా అదే మాట చెబుతూ, జరిగిన విషయాన్ని పట్టుకుని ఇలా కోపంగా ఉంటే ఇంట్లో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరని అంటుంది. ప్రభావతి మాత్రం రోహిణిపై పెట్టుకున్న ప్రేమ, నమ్మకం గుర్తు చేసుకుని ఇంకా బాధపడుతూనే ఉంటుంది. మనోజ్–రోహిణి పెళ్లి తనే జరిపించానని, వాళ్లు సంతోషంగా ఉండాలని తాను కూడా కోరుకున్నానని చెబుతుంది. కానీ వాళ్లు చేసిన మోసం తనకు తట్టుకోవడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఇదిలా ఉండగా, మరోవైపు విద్య ఇంట్లో రోహిణి తీవ్ర నిరాశలో కనిపిస్తుంది. సత్యం, ప్రభావతి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంది. తాను కట్టుకున్న కలలన్నీ ఒక్కసారిగా కూలిపోతున్నాయని, భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని బాధపడుతుంది. విద్య మాత్రం నిజం ఎప్పటికైనా బయటపడేదేనని గుర్తు చేస్తుంది. కల్పన విషయం బయటపడటంతో తప్పించుకోలేకపోయావని చెబుతుంది. అదే సమయంలో ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా అడుగుతుంది — డబ్బు తీసుకుని వ్యాపారం ఇద్దరూ కలిసి మొదలుపెట్టారు కానీ, ఇప్పుడు మొత్తం తప్పు నీదే అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు అని. రోహిణి కూడా ప్రభావతి తన కొడుకు తప్పు ఎప్పుడూ చూడదని బాధపడుతుంది.
ఇంకా తర్వాత, రోహిణి మనసులో మరో భయం బయటపడుతుంది. ఇప్పుడే ఈ స్థాయిలో అవమానం ఎదురైతే, రేపు మలేషియా విషయం, చింటూ విషయం బయటపడితే పరిస్థితి ఇంకా ఎలా మారుతుందో అని విద్య హెచ్చరిస్తుంది. రోహిణి ఇప్పటికే మానసికంగా భయపడుతూ ఉండగా, ఈ మాటలు ఆమెను మరింత భయపెడతాయి.
ఇదిలా ఉండగా, ఇంట్లో బాలు–మీనా కూడా ఇదే విషయంపై మాట్లాడుకుంటారు. మీనా, ప్రభావతి రోహిణి–మనోజ్‌లను ఇలా దూరం చేయడం సరైంది కాదని అంటుంది. బాలు మాత్రం ఇది తమ తల్లి స్వభావమని చెబుతాడు. అదే సమయంలో ప్రభావతి మనోజ్‌ను పిలిచి, రోహిణికి ఫోన్ చేశావా అని అడుగుతుంది. మనోజ్ మాత్రం ప్రభావతి మాట్లాడొద్దన్నందుకే ఫోన్ చేయలేదని చెబుతాడు. దీంతో బాలు మళ్లీ అతన్ని ఎగతాళి చేస్తూ, భార్యతో మాట్లాడాలంటే కూడా తల్లి అనుమతి కావాలా అని మీనాతో అంటాడు. చివరకు ప్రభావతి తానే రోహిణిని ఇంటికి రమ్మని చెప్పమని మనోజ్‌కు చెబుతుంది.
ఇంకా మరోవైపు, విద్య ఇంట్లో రోహిణి మాత్రం మనోజ్ ఫోన్ ఎత్తకుండా అతనికి కాస్త తన విలువ తెలియాలని అనుకుంటుంది. మనోజ్ పదే పదే ఫోన్ చేస్తున్నా ఎత్తొద్దని విద్యకు కూడా చెబుతుంది. చివరకు విద్య పొరపాటున రోహిణి తన దగ్గర లేదని ముందే చెప్పేయడంతో, మనోజ్‌కు అనుమానం వస్తుంది. అయినా కూడా రోహిణి నేరుగా మాట్లాడకుండా, “వాళ్ల అమ్మ చెప్పినందుకే ఫోన్ చేస్తున్నాడు కానీ, నిజంగా నన్ను మిస్ అవుతున్నానని ఒక్క మాట కూడా చెప్పలేదు” అని బాధపడుతుంది. మనోజ్ చదువులు పెద్దవి అయినా, తనంతట తాను ఆలోచించే పరిపక్వత లేదని కూడా అంటుంది. చివరకు పరిస్థితిని అర్థం చేసుకుని, ఇప్పుడు గొడవ పెట్టుకునే సమయం కాదని, ముందుగా మనోజ్‌ను తనవైపు తిప్పుకోవాలని నిర్ణయిస్తుంది.
ఇదిలా ఉండగా, ఇంట్లో అందరూ రోహిణి తిరిగి వస్తుందా లేదా అని మాట్లాడుకుంటారు. బాలు మాత్రం ఆమె తప్పకుండా వస్తుందని నమ్మకంగా చెబుతాడు. కొద్దిసేపటికే రోహిణి ఇంటికి చేరుతుంది. ప్రభావతి వెంటనే ప్రశ్నలు మొదలుపెడుతుంది — ఇష్టం వచ్చినప్పుడు వెళ్లిపోవడం, తిరిగి రావడం ఈ ఇల్లు బస్ స్టాండ్ కాదని గట్టిగా చెబుతుంది. బాలు మధ్యలో తన స్టైల్లో సరదాగా మాట్లాడినా, ప్రభావతి మాత్రం ఈ విషయాన్ని చాలా తీవ్రమైనదిగా చూస్తుంది. ఈ సమస్య డబ్బు గురించి మాత్రమే కాదని, ఇంటి గౌరవం, నమ్మకం గురించి కూడా అని స్పష్టంగా చెబుతుంది.
ఇంకా తర్వాత, రోహిణి ప్రభావతి కాళ్లపై పడి క్షమాపణ అడుగుతుంది. మనోజ్ కూడా క్షమించమని అడుగుతాడు. కామాక్షి చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న ప్రభావతి చివరకు కొంత మెత్తబడుతుంది. కానీ సత్యం మాత్రం ఇకపై అబద్ధాలు, మోసాలు జరగకూడదని గట్టిగా హెచ్చరిస్తాడు. కుటుంబంలో ఏ నిర్ణయం అయినా అందరితో మాట్లాడుకుని తీసుకోవాలని చెబుతాడు.
ఇదిలా ఉండగా, బాలు మరోసారి కొత్త విషయం లేవనెత్తుతాడు. షోరూమ్ డబ్బు మలేషియా నుంచి రాలేదని, సత్యం కష్టార్జితంతోనే ఆ వ్యాపారం మొదలైందని గుర్తు చేస్తాడు. అందుకే ఇకపై షోరూమ్ యజమాని స్థానంలో మనోజ్ కాకుండా సత్యమే ఉండాలని తీర్పు ఇస్తాడు. మనోజ్ నిర్వాహకుడిలా పని చేసి ప్రతి వారం లెక్కలు చూపించాలని చెబుతాడు. రవి, శృతి ఈ నిర్ణయానికి మద్దతు ఇస్తారు. మీనా కూడా బాలు నిర్ణయానికి చప్పట్లు కొడుతుంది. ప్రభావతి బయటకు ఏమీ అనకపోయినా, బాలు మాత్రం “ఇదే చివరి తీర్పు” అని ప్రకటిస్తాడు.
చివరగా, గదిలో మనోజ్–రోహిణి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ప్రభావతి తనను తిడుతుంటే, బాలు షోరూమ్ విషయంలో అవమానపరుస్తుంటే కూడా మనోజ్ నోరు విప్పలేదని రోహిణి మండిపడుతుంది. తాను చేసినది అంతా మనోజ్ కోసమేనని, అతన్ని యజమాని స్థానంలో చూడాలని అనుకున్నానని చెబుతుంది. కానీ ఇప్పుడు తననే అందరూ తప్పుపడుతుండగా, మనోజ్ మాత్రం మౌనంగా ఉండిపోయాడని బాధపడుతుంది. మనోజ్ మాత్రం తాను కూడా చాలా బాధపడ్డానని చెబుతాడు. కానీ రోహిణి అక్కడితో ఆగకుండా, “నేను లేకపోతే నిన్నెవరు పట్టించుకునేవారు?” అంటూ అతన్ని మరింత గట్టిగా ప్రశ్నిస్తుంది. చివరికి ఈ ఇంట్లో తాను అవమానాలు పడటానికే వచ్చినట్టుగా ఉందని బాధపడుతూ మాట్లాడుతుంది.
